ఉపాధ్యాయుల అభ్యున్నతికి కృషి
ఆత్మకూరు మండల పీఆర్టీయూ నూతన అధ్యక్షుడు అబ్బు బుచ్చిరెడ్డి
ఏకగ్రీవంగా ఆత్మకూరు మండల పీఆర్టీయూ ఎన్నిక
కాకతీయ, ఆత్మకూరు : ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని ఆత్మకూరు మండల పీఆర్టీయూ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అబ్బు బుచ్చిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, అధ్యక్షుడిగా అబ్బు బుచ్చిరెడ్డిని, ప్రధాన కార్యదర్శిగా బొమ్మెర సోమయ్యను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు ఎటువంటి అన్యాయం జరిగినా సహించేది లేదని, వారి సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ వేదికగా పోరాడుతామని తెలిపారు. నూతన విద్యా విధానాలకు అనుగుణంగా ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో ఉపాధ్యాయులకు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్, సమత, కిరణ్, రజిత, అపర్ణ, అశోక్ వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

