- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలి
- ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేసి పారదర్శక పరీక్షలు నిర్వహించాలి
- జమ్మికుంటలో సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన
కాకతీయ, కరీంనగర్ / జమ్మికుంట : ఢిల్లీలో విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ జమ్మికుంట గాంధీ చౌరస్తాలో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం, వారిపై పోలీసులతో దమనకాండకు పాల్పడటం అత్యంత దుర్మార్గమని, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వాసుదేవరెడ్డి విమర్శించారు. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన తీవ్రమైన అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల హక్కులకు విఘాతం కలిగిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వ్యవస్థను రద్దు చేసి, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా పారదర్శక పరీక్షల విధానాన్ని అమలు చేయాలని కోరారు.
గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి
జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై టియర్‌గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించడం, విచక్షణారహితంగా లాఠీచార్జి చేయడం అమానుష చర్య అని ఆయన మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అత్యంత కీలకమైన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి జక్కుల రమేష్ యాదవ్, మండల కమిటీ సభ్యులు దండిగారి సతీష్, గడ్డం శోభన్, మారేపల్లి కిరణ్, సిరికొండ పోచయ్య, వేషాల రమేష్, పుల్ల కరుణాకర్, నిమ్మల నాగరాజు, పుల్ల నరేష్, కేసాని రమేష్, ఉడుత నాగరాజు తదితరులు పాల్గొని ప్రభుత్వ తీరును ఖండించారు.

