కష్టపడి చదివితే.. కన్నీళ్లే బహుమతా..?
– ఎగిసిపడ్డ కాంగ్రెస్ నిరసన జ్వాలలు
– రాయపర్తి రాజీవ్ చౌరస్తాలో రాస్తారోకో
– ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
– నష్టపోయిన నిరుద్యోగులకు తగిన న్యాయం చేయాలి
– మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి
కాకతీయ, రాయపర్తి : రాత్రింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాసే నిరుద్యోగ యువతకు పేపర్ లీకేజీల రూపంలో కన్నీళ్లే బహుమతిగా ఇస్తున్నారా? అంటూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ,కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ..గురువారం మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన భారీ ర్యాలీ,ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి,ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. మోదీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు.నాయకులు,కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో కొంత సమయం పాటు భారీగా వాహనాలు స్తంభించిపోయాయి.ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ..కష్టపడి చదివిన నిరుద్యోగులకు కన్నీళ్లే బహుమతిగా ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు.ఎంతోమంది పేద,మధ్యతరగతి విద్యార్థుల కలలను కాలరాస్తూ పేపర్ లీకేజీల పేరుతో వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. నిరుద్యోగులకు అండగా నిలిచిన కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలను కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని అన్నారు.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని మండల పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,మండల స్థాయి నాయకులు,వివిధ గ్రామాల సర్పంచులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


