22 ఏళ్లుగా అఖండ భజన అభినందనీయం
ఆధ్యాత్మిక సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కాకతీయ, చందుర్తి: తొలి ఏకాదశి సందర్భంగా చందుర్తిలో గత 22 ఏళ్లుగా అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శనివారం సాధు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ భజన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక సంప్రదాయాలను పరిరక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న సాధు సజ్జన భజన మండలి సభ్యులను అభినందించారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అఖండ భజన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.

