వారంతపు సంతను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
నేరుగా విక్రయించేందుకు రైతులకు అవకాశం
ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్‌బాబు
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించడంతో పాటు స్థానిక వ్యాపారులకు ఉపాధి అవకాశాలు పెంచడమే వారాంతపు సంత లక్ష్యమని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్‌బాబు తెలిపారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో శనివారం తొలి ఏకాదశి సందర్భంగా వారాంతపు సంతను ఘనంగా ప్రారంభించారు. ప్రతి శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి కూరగాయల మార్కెట్ మీదుగా బోడ్రాయి వరకు, అక్కడి నుంచి చేపల మార్కెట్ వరకు సంత నిర్వహించనున్నట్లు తెలిపారు.
రైతులకు, వ్యాపారులకు లాభం
వారాంతపు సంతతో రైతులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం లభిస్తుందని, స్థానిక వ్యాపారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వస్తువులు ఒకేచోట అందుబాటులోకి రావడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుందని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, రైతులు, వ్యాపారులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానికులు వారాంతపు సంతను స్వాగతిస్తూ, ఏటూరునాగారం అభివృద్ధిలో ఇది కీలక ముందడుగని అభిప్రాయపడ్డారు.

