- భూ రికార్డుల అక్రమాలపై విచారణ జరపాలి
- తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి చింత కృష్ణ
- వాజేడు తహసీల్దార్ కార్యాలయంపై తుడుం దెబ్బ ఆరోపణలు
కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా వాజేడు తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డుల నిర్వహణలో అక్రమాలు జరిగాయని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు చింత కృష్ణ ఆరోపించారు. చెరుకూరు గ్రామానికి చెందిన యాలం సమ్మయ్య కుటుంబ భూమిని చట్టబద్ధ ఆధారాలు లేకుండానే ఇతరుల పేర్లకు బదిలీ చేశారని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ ప్రత్యేక విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.యాలం సమ్మయ్యకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వకుండా నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని, ఇదే సమయంలో కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా పట్టా పాస్‌బుక్‌ను ఇతరుల పేర్లకు బదిలీ చేశారని చింత కృష్ణ ఆరోపించారు. ఈ వ్యవహారంలో డిప్యూటీ తహసీల్దార్‌ను సస్పెండ్ చేసి, సమగ్ర విచారణ నిర్వహించి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులను ఆయన డిమాండ్ చేశారు.

