- ఇంట్లో దాచిన రూ.26 లక్షలు చోరీ.. ప్రధాన నిందితుడి అరెస్ట్
కాకతీయ, కరీంనగర్: చిన్ననాటి స్నేహితుడి ఇంట్లో దాచి ఉంచిన రూ.26 లక్షల నగదును చోరీ చేసిన కేసును కరీంనగర్ రూరల్ పోలీసులు ఛేదించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో ప్రధాన నిందితుడు తగరం శంకర్ లాల్ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ.17.60 లక్షల నగదు, నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ కారు, శాంసంగ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితురాలు అడెపు రేష్మ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బ్యాంకు లాకర్లలో విలువైన వస్తువులు భద్రపరచాలి
పోలీసుల వివరాల ప్రకారం, భూమి విక్రయించి ఇంట్లో దాచిన నగదు గురించి ముందే తెలుసుకున్న శంకర్ లాల్, ఇంటి నిర్మాణం, అదనపు తాళంచెవి ఉంచే స్థలంపై ఉన్న అవగాహనతో చోరీకి పాల్పడ్డాడు. అదనపు తాళంచెవి లభించకపోవడంతో తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి రూ.26 లక్షలు అపహరించాడు. కేసును ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి దర్యాప్తు చేసి ఛేదించగా, పోలీసు కమిషనర్ గౌస్ ఆలం బృందాన్ని అభినందించారు. అధిక మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలను ఇళ్లలో కాకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

