- జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం
- పాడే మోసిన ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్
కాకతీయ, నెల్లికుదురు: కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. మూడు దశాబ్దాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఆయన మృతి కాంగ్రెస్ శ్రేణులను విషాదంలో ముంచింది. నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి అందరితో ఆప్యాయంగా మెలుగుతూ, పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడిగా గుర్తింపు పొందారు. లక్ష్మారెడ్డి మృతి వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే డా. భూక్య మురళీ నాయక్, డీసీసీ జిల్లా అధ్యక్షురాలు డా. ఉమా మురళీ నాయక్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు రామన్నగూడెం చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మహాప్రస్థాన యాత్రలో పాల్గొని పాడె మోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, లక్ష్మారెడ్డి అందరినీ కలుపుకుని పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారని, ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. కార్యక్రమంలో జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి, ప్రభాకర్ గౌడ్, యాదవ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, బాలాజీ నాయక్, బైరు అశోక్ గౌడ్, రంజిత్ రెడ్డి, గుట్టయ్య గౌడ్తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

