కాకతీయ కథనంతో కదిలిన అధికారులు
దెబ్బతిన్న రహదారికి తాత్కాలిక మరమ్మతులు
శాశ్వత పరిష్కారం చేయాలని స్థానికుల డిమాండ్
కాకతీయ, చేర్యాల: చేర్యాల అంగడి బజారు–పెద్దమ్మగడ్డ ప్రధాన రహదారిపై ప్రమాదకర పరిస్థితులపై కాకతీయలో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు, స్థానిక కౌన్సిలర్ స్పందించారు. రోడ్డు కుంగిపోవడంతో పెట్రోల్ ట్యాంకర్ ఇంటివైపు ఒరిగిన ఘటన అనంతరం ప్రమాద ప్రాంతంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.ఇంధనంతో ఉన్న ట్యాంకర్ ప్రమాదానికి గురికావడంతో పెను ప్రమాదం తృటిలో తప్పిన విషయం తెలిసిందే. రహదారి దుస్థితిని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ కథనం తర్వాత యంత్రాంగం కదలడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రజలు, తాత్కాలిక పనులతో సరిపెట్టకుండా రహదారిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని, శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులు, స్థానిక కౌన్సిలర్ ఇజాజ్ అహ్మద్ (బాబ్లు)ను కోరుతున్నారు.

