అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం
రూ.4 లక్షల విలువైన 11 టేకు దిమ్మలు, బొలెరో వాహనం పట్టివేత
ఇద్దరు పరారీ.. అక్రమ రవాణా ముఠాపై దర్యాప్తు ప్రారంభం
కాకతీయ, ఏటూరునాగారం : నూగూరు–వెంకటాపురం మండలంలో అక్రమంగా తరలిస్తున్న విలువైన టేకు కలపను అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వెంకటాపురం వైపు అనుమానాస్పదంగా వస్తున్న బొలెరో వాహనాన్ని రామచంద్రాపురం గ్రామ శివారులో గస్తీ నిర్వహిస్తున్న అటవీ శాఖ సిబ్బంది గుర్తించి అడ్డగట్టి తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వాహనంలో ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 11 టేకు దిమ్మలు బయటపడగా, వాటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. టేకు కలపతో పాటు రవాణాకు ఉపయోగిస్తున్న బొలెరో వాహనాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పరారీలో నిందితులు.. విచారణ ముమ్మరం
అటవీ సిబ్బంది తనిఖీలు చేపట్టిన సమయంలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి వాహనాన్ని వదిలి పరారైనట్లు సమాచారం. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిసింది. చత్తీస్‌గఢ్ నుంచి టేకు కలపను అక్రమంగా తరలిస్తున్న ముఠాపై అటవీ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కలపను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

