పీఎం శ్రీతో ప్రభుత్వ బడులకు కొత్త రూపు
కరీంనగర్ జిల్లాలో 22 పాఠశాలలకు ఆధునిక వసతులు
ఏఐ హబ్‌గా ఒక ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి
కాకతీయ, కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం శ్రీ పథకం కింద కరీంనగర్ జిల్లాలో ఎంపికైన 22 ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు నిధులు మంజూరయ్యాయి. ఒక్కో పాఠశాలకు సుమారు రూ.9.75 లక్షలు కేటాయించగా, ఈ నిధులతో విద్యార్థులకు అత్యాధునిక విద్యా వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ నిధులతో సైన్స్, గణితం, కంప్యూటర్ ప్రయోగశాలలు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్ బోధనా పరికరాలు, ప్రొజెక్టర్లు, ఇంటరాక్టివ్ బోర్డులు తదితర ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. సాంకేతిక ఆధారిత బోధనకు ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా విద్యా వ్యవస్థను ఆధునికీకరించనున్నారు.
ఏఐ హబ్‌గా ప్రత్యేక పాఠశాల
జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలను కృత్రిమ మేధస్సు (ఏఐ) హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక పరికరాలు, సాఫ్ట్‌వేర్, శిక్షణా కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థులకు ఏఐ, సాంకేతిక విజ్ఞానంపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు.మౌలిక వసతులు, ఆధునిక బోధనా విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా నిలుస్తున్నాయని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నాణ్యమైన బోధన, ఆధునిక సదుపాయాల కారణంగా ప్రభుత్వ బడులపై తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతుండగా, ప్రతి ఏడాది విద్యార్థుల చేరికలు కూడా క్రమంగా పెరుగుతున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. పీఎం శ్రీ పథకం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో మరింత నాణ్యమైన విద్యా వాతావరణం ఏర్పడి, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన సాంకేతిక నైపుణ్యాలు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

