కారేపల్లి పోలీస్ స్టేషన్లో సీపీ ఆకస్మిక తనిఖీ
బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశం
కాకతీయ, కారేపల్లి : కారేపల్లి పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్ నిర్వహణ, రికార్డులు, సీజ్ చేసిన వాహనాలు, జనరల్ డైరీ, విచారణ పురోగతిని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. గ్రామాలు, ప్రధాన కూడళ్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. డయల్-100 స్పందన సమయాన్ని మెరుగుపరచడంతో పాటు రౌడీషీటర్లు, పేకాట శిబిరాలు, ఇతర అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐ సాగర్, ఎస్సై గోపి పాల్గొన్నారు.

