కోట మైసమ్మకు మంత్రి కొండా సురేఖ బంగారు బోనం
వంచనగిరిలో వైభవంగా బోనాల వేడుకలు
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. భారీ ఊరేగింపు
కాకతీయ, గీసుగొండ : వరంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరి గ్రామంలోని కోట మైసమ్మ అమ్మవారి బోనాల వేడుకలు ఆషాఢ మాసం తొలి బుధవారం ఘనంగా జరిగాయి. తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన స్వగ్రామంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వగృహం నుంచి సంప్రదాయబద్ధంగా బంగారు బోనాన్ని తలపై ఎత్తుకుని డప్పు చప్పుళ్లు, పోతరాజుల నృత్యాలు, మంగళ వాయిద్యాల నడుమ భారీ ఊరేగింపుగా కోట మైసమ్మ ఆలయానికి చేరుకుని బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని కోట మైసమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షిస్తూ ప్రతి ఏడాది స్వగ్రామంలో బోనాల వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. బోనాల ఊరేగింపులో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించగా, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు రడం భరత్ కుమార్, గోపాల నవీన్ రాజ్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.


