వరదపై అప్రమత్తంగా ఉండాలి
మత్తడి దూకితే వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేయాలి
ఎగువ మానేరు పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్
కాకతీయ, గంభీరావుపేట : ఎగువ మానేరు జలాశయంలోకి వరద నీరు చేరుతున్న నేపథ్యంలో నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ మహేష్ బి.గితేతో కలిసి జలాశయాన్ని పరిశీలించిన ఆమె, నీటిమట్టం, వరద ప్రవాహంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.6 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వివరించారు. వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల ప్రజలు, రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. మత్తడి దూకే పరిస్థితి ఏర్పడితే వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీధర్ బాబు, నీటిపారుదల శాఖ అధికారులు దయాకర్, ప్రశాంత్, తహసీల్దార్ మారుతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

