రంగురాళ్లబోడు–సాయనపేటకు రోడ్డు ఎప్పుడేస్తారు?
రెండు గ్రామాల మధ్య ఉన్న దారికి వర్షాకాలంలో నరకయాతన
నాయకులు వస్తున్నారు.. పోతున్నారు.. సమస్య మాత్రం తీరడం లేదు
: మండిపడుతున్న రెండు గ్రామాల ప్రజలు
కాకతీయ, కారేపల్లి : రంగురాళ్లబోడు–సాయనపేట రహదారి సమస్య ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్నా పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే ఈ రహదారి బురదమయంగా మారి, గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి దుస్థితిపై ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఇప్పటికే తెలిపారని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో ఇప్పటికీ రహదారి పనులు ప్రారంభం కాలేదని చెబుతున్నారు. రోడ్డు శాంక్షన్ అయిందని చెబుతున్నా తమ కష్టాలు మాత్రం తీరడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు గ్రామాలకు వచ్చి హామీలు ఇచ్చి వెళ్లిపోతున్నారని, ఎన్నికలు ముగిసిన తర్వాత రహదారి సమస్యను పట్టించుకునే వారు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారీ రహదారి బురదమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడి కాంట్రాక్టర్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. రహదారి పనులు వెంటనే ప్రారంభించి, వర్షాకాలంలో ఎదురవుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని రంగురాళ్లబోడు–సాయనపేట గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

