కామేపల్లి కాంగ్రెస్‌లో క‘లహం’..!
డీసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే ఇరువర్గాల ఘర్షణ
పార్టీ కార్యాలయంలో ఉద్రిక్తత.. మాజీ ఎంపీటీసీపై దాడి ఆరోపణ
చేరికలతో పెరిగిన పాత, కొత్త నేతల ఆధిపత్య పోరు
వర్గాలను ప్రోత్సహిస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలి : గింజల నర్సింహారెడ్డి
కాకతీయ, కారేపల్లి/కామేపల్లి : కామేపల్లి కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు బహిర్గతమైంది. పార్టీలో పాత, కొత్త నాయకుల మధ్య కొంతకాలంగా సాగుతున్న విభేదాలు డీసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే ఘర్షణకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే ఇరువర్గాలు పరస్పరం ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్యపై మరో వర్గానికి చెందిన వారు దాడి చేశారంటూ ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది. ఇటీవల బీఆర్ఎస్, టీడీపీ తదితర పార్టీల నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరడంతో పాత, కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరిందనే చర్చ పార్టీ శ్రేణుల్లో సాగుతోంది. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు తామే తీసుకొచ్చామని రెండు వర్గాలు పరస్పరం క్రెడిట్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయ విభేదాలు క్రమంగా బహిరంగ వివాదాలుగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కమిటీల ఏర్పాటులోనూ పోటీ
పార్టీ పదవుల ఎంపికలోనూ వర్గపోరు ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. గ్రామ కమిటీల ఏర్పాటు విషయంలో సాతానిగూడెం, కొత్తలింగాల గ్రామాల్లో రెండు వర్గాలు చెరో కమిటీ ఏర్పాటు చేసుకోవడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఒకే పార్టీకి రెండు కమిటీలు ఎలా ఉంటాయంటూ పలువురు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సంస్థాగత నిర్మాణం బలోపేతం చేయాల్సిన సమయంలోనే కమిటీల విషయంలో వివాదాలు తలెత్తడం పార్టీ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. పార్టీలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారంటూ మండల అధ్యక్షుడు గుజ్జర్లపూడి రాంబాబు, పుచ్చకాయల వీరభద్రం, పతే అహ్మద్‌పై డీసీసీ జిల్లా కార్యదర్శి గింజల నర్సింహారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఆధిపత్యానికి ప్రాధాన్యం ఇస్తున్న వారిని వెంటనే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతర్గత విభేదాలకు కారణమవుతున్న నాయకులపై డీసీసీ, పీసీసీ అధ్యక్షులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని, వర్గపోరుతో కార్యకర్తల్లో అయోమయం సృష్టించడం సరికాదని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.

