ఇంటిగ్రేటెడ్ గురుకులాలు.. మార్పు తెచ్చేనా?
కొత్త ప్రభుత్వానికి ఇది ఓ సవాల్!
సమస్యల వలయంలో ప్రస్తుత గురుకులాలు
అద్దె భవనాల్లోనే 90 శాతం నిర్వహణ
వసతుల్లేక.. విద్యార్థుల అవస్థలు
పర్యవేక్షణ లోపాలకు చెక్ పడేనా?
కాకతీయ, ఖమ్మం : అన్ని వర్గాల గురుకులాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటు ఇప్పుడు కీలక సవాల్‌గా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇప్పటివరకు వేర్వేరుగా కొనసాగుతున్న గురుకులాలను ఒకే ప్రాంగణంలోకి తీసుకురావడం ద్వారా కుల, మత భేదాలకు అతీతంగా విద్య అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. పైలెట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నియోజకవర్గాల్లో ఈ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఆలోచన కొత్తది.. లక్ష్యం పెద్దది. కానీ ఇప్పటివరకు ఉన్న గురుకులాల పరిస్థితి చూస్తే.. కొత్త విధానం ఆచరణలో ఎంతవరకు ఫలిస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సమస్యల వలయంలో గురుకులాలు
గురుకుల విద్య అంటే కేవలం ఉచిత విద్య, వసతి కల్పించడం మాత్రమే కాదు. విద్యార్థులు సురక్షితంగా ఉండేందుకు అనువైన భవనాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, నాణ్యమైన భోజనం, సరిపడా తరగతి గదులు, వసతి గదులు ఉండాలి. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు గురుకులాల్లో ఇవన్నీ ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలు అనేకం ఉన్నాయి. ఖమ్మం జిల్లా పరిధిలో సుమారు 90 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయన్న పరిస్థితి ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. ప్రభుత్వం అద్దెల రూపంలో భారీగా నిధులు వెచ్చిస్తున్నా.. విద్యార్థులకు మాత్రం అవసరమైన సౌకర్యాలు అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
అద్దె భవనాలు.. అరకొర వసతులు
గురుకులాల నిర్వహణకు సరైన భవనాలు లేకపోవడంతో విద్యార్థులు ఇరుకైన గదుల్లోనే గడపాల్సి వస్తోంది. తరగతి గదులు, వసతి గదులు, వంటశాల, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు విద్యార్థుల సంఖ్యకు సరిపడా లేకపోవడం సమస్యగా మారింది. కొన్ని చోట్ల 300 మంది విద్యార్థులకు సరిపడే వసతి సామర్థ్యం ఉండగా.. 800 మందికి పైగా విద్యార్థులను చేర్చుకున్న సందర్భాలున్నాయి. ఒక గదిలో 20 మంది ఉండాల్సిన పరిస్థితికి బదులుగా 40, 50 మంది వరకు ఉంటున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. ఇరుకు గదుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను ఉంచడం వల్ల వారి చదువుతో పాటు ఆరోగ్యం, భద్రతపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.
భోజనం.. పారిశుద్ధ్యం.. అన్నీ సమస్యలే
గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సి ఉండగా.. కొన్ని చోట్ల మెనూ ప్రకారం భోజనం అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సమయానికి భోజనం వడ్డించకపోవడం, నిర్ణయించిన మెనూకు భిన్నంగా వంటలు చేయడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు మరుగుదొడ్ల కొరత, పారిశుద్ధ్య లోపాలు కూడా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాగునీటి సమస్యతో పాటు మురుగునీటి నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రాంగణాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వర్షం పడితే కొన్ని గురుకులాల్లో తరగతి గదుల్లోకి నీరు చేరుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థినుల గురుకులాల్లో భద్రత అత్యంత కీలకం. అయినా కొన్ని మహిళా గురుకులాల్లో వంట పనులకు పురుషులను వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థినుల వసతి ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది విషయంలో మరింత కఠినమైన నిబంధనలు, పర్యవేక్షణ అవసరం. ఇలాంటి అంశాల్లో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నందున అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. గురుకులాల నిర్వహణలో సిబ్బంది, వసతి, భోజనం, భద్రత, పారిశుద్ధ్యం వంటి ప్రతి అంశంపై బాధ్యతలు స్పష్టంగా నిర్దేశించాల్సి ఉంది.
ఇంటిగ్రేటెడ్‌తోనైనా మార్పు వస్తుందా?
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ గురుకులాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను వేర్వేరుగా నిర్వహించే విధానానికి బదులుగా.. ఒకే ప్రాంగణంలో అన్ని వర్గాల విద్యార్థులకు విద్య అందించాలన్న ఆలోచన సామాజిక సమానత్వానికి దోహదపడే అవకాశం ఉంది. అయితే భవనాలు కొత్తగా నిర్మించడం ఒక్కటే సరిపోదు. గత గురుకులాల్లో కనిపించిన లోపాలు కొత్త ప్రాంగణాల్లో పునరావృతం కాకుండా పర్యవేక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతి, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, భోజనశాలలు, సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు ఉండాలి. నిర్వహణలో జవాబుదారీతనం లేకపోతే ఎంత భారీ ప్రాజెక్టు అయినా ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. ఇంటిగ్రేటెడ్ గురుకులాలు తెలంగాణ విద్యారంగంలో పెద్ద ప్రయోగం. కులమత భేదాలకు అతీతంగా విద్య అందించాలన్న లక్ష్యం ప్రశంసనీయమే. అయితే ప్రయోగం విజయవంతం కావాలంటే నిర్మాణాల కంటే నిరంతర పర్యవేక్షణ, సమర్థ నిర్వహణ, నాణ్యమైన భోజనం, పారిశుద్ధ్యం, భద్రత, విద్యార్థుల సంఖ్యకు తగిన మౌలిక వసతులు కీలకం. ప్రస్తుతం ఉన్న గురుకులాల్లోని సమస్యలను అధ్యయనం చేసి.. వాటికి శాశ్వత పరిష్కారాలు చూపినప్పుడే కొత్త విధానం సార్థకమవుతుంది. లేకపోతే పేర్లు మారినా.. సమస్యలు మాత్రం కొనసాగుతాయన్న భయం ఉంటుంది. అందుకే ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ప్రభుత్వం కేవలం నిర్మాణ ప్రాజెక్టుగా కాకుండా.. గురుకుల వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేసే అవకాశంగా చూడాల్సిన అవసరం ఉంది.

