తులం బంగారం హామీని అమలు చేయాలి
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై ప్రభుత్వ తీరు ఆందోళనకరం
పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి
ని బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు
కాకతీయ, ఖమ్మం టౌన్ : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పేద కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోందని బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలు వేలాది కుటుంబాలకు అండగా నిలిచాయని గుర్తుచేశారు. హైకోర్టులో ఈ పథకాలపై విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం తగిన విధంగా స్పందించి, అర్హులైన కుటుంబాలకు పథకాల ప్రయోజనాలు అందేలా న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని నామ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేద కుటుంబాలు నష్టపోయే పరిస్థితి రాకుండా చూడాలని సూచించారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై నెలకొన్న అనిశ్చితికి ప్రభుత్వం వెంటనే తెరదించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు.
తులం బంగారం హామీ ఏమైంది?
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కళ్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని నామ గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలుపై స్పష్టత లేకుండా పోయిందని విమర్శించారు. పేదల ఆడబిడ్డల వివాహాల విషయంలో రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్పథంతో ప్రభుత్వం వ్యవహరించాలని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నందున వాటిని యథావిధిగా కొనసాగించాలని నామ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పథకాల అమలుపై స్పష్టమైన ప్రకటన చేసి పేద కుటుంబాలకు భరోసా కల్పించాలని కోరారు.

