వరంగల్‌లో పచ్చదనానికి ప్రాధాన్యం
రూ.530 కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
వనమహోత్సవంలో ఎమ్మెల్యే నాయిని
త్వరలో యూజీడీ పనులు.. నీటి పైప్‌లైన్లు, రోడ్లు, సెంట్రల్ లైటింగ్ కూడా
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : నగరంలో పచ్చదనం, పరిశుభ్రతతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం హంటర్ రోడ్‌లోని 49వ డివిజన్ లెక్చరర్స్ కాలనీ, సాయి బృందావన్ కాలనీలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్నతో కలిసి వనమహోత్సవంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరానికి ఆధునిక అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ తీసుకొస్తున్నామని, ఇందుకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. యూజీడీతో పాటు నీటి పైప్‌లైన్లు, రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులను సమగ్రంగా చేపడతామని తెలిపారు. ప్రజాధనం వృథా కాకుండా ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. తాగునీటి సమస్యకు రూ.530 కోట్లతో శాశ్వత పరిష్కారం చూపుతున్నామని, వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ఆధునీకరణతో పాటు కొత్త నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ కాలనీల్లో పచ్చదనం పెంపునకు ప్రజలు నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

