రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి స్వాధీనం
అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ద్విచక్ర వాహనం, రూ.9 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం
ఒడిశా నుంచి తెచ్చి పలు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తింపు
వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తిని దామెర పోలీసులు అరెస్ట్ చేసి, అతడి నుంచి సుమారు రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు ద్విచక్ర వాహనం, రూ.9 వేల నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన ముదిగొండ నాగేశ్వర్‌రావు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తనకున్న నెట్‌వర్క్ ద్వారా ఒడిశాకు చెందిన రమేష్, సుధాకర్ వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలువురికి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న దామెర పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో గంజాయి కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో అతడి ఇంట్లో నిల్వ ఉంచిన భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇతర నిందితుల కోసం గాలింపు
గంజాయి సరఫరా నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర నిందితులను కూడా పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా కాపాడటంతో పాటు గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాను అరికట్టేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పోలీస్ కమిషనర్ తెలిపారు. గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పరకాల ఏసీపీ సతీష్‌బాబు, శాయంపేట సీఐ సుధాకర్‌రెడ్డి, దామెర ఎస్‌ఐ వీరభద్రరావు, శాయంపేట ఎస్‌ఐ పరమేశ్వర్, పరకాల ఎస్‌ఐ రఘుపతి, ఏఏఓ సల్మాన్‌పాషాతో పాటు దామెర, శాయంపేట పోలీసు సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

