1000 రోజుల పాలన.. హామీల అమలు ఏదీ?
కాంగ్రెస్ వైఫల్యాలపై పరకాలలో బీఆర్‌ఎస్ నిరసన
420 అడుగుల ఫ్లెక్సీతో భారీ ర్యాలీ.. బస్టాండ్ వద్ద ధర్నా
హామీలు అమలు చేయకుంటే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాకతీయ, పరకాల : కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం పరకాలలో భారీ నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు 420 అడుగుల ఫ్లెక్సీతో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ ప్రారంభించగా.. అనంతరం బస్టాండ్ కూడలి వద్ద ధర్నా చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ, రైతుభరోసా, రెండు లక్షల ఉద్యోగాల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని దేవుళ్లపై ప్రమాణాలు చేసి, బాండ్ పేపర్లపై సంతకాలు చేసినప్పటికీ 1000 రోజులు గడిచినా అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, పేదలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలను ప్రజలకు గుర్తుచేస్తూ బీఆర్‌ఎస్ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని ధర్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే నియోజకవర్గవ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

