ప్రేమ పేరుతో మోసం.. గర్భిణీ యువతి బలవన్మరణం
పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు
గర్భం దాల్చిన తర్వాత నిరాకరణ
పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినా కొలిక్కిరాని సమస్య
నాలుగేళ్ల ప్రేమ బంధం విషాదాంతం
సీరోల్ ఎస్ఐ సంతోష్ ఆధ్వర్యంలో దర్యాప్తు
కాకతీయ, మహబూబాబాద్ : ప్రేమ పేరుతో మోసపోయిన ఓ గర్భిణీ యువతి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండి మౌనిక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మౌనికకు అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌తో నాలుగేళ్లుగా ప్రేమ సంబంధం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన శ్రీకాంత్.. మౌనిక గర్భం దాల్చిన అనంతరం పెళ్లికి నిరాకరించినట్లు తెలిపారు. ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. పెళ్లికి అంగీకారం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసినట్లు సీరోల్ ఎస్ఐ సంతోష్ తెలిపారు. ఫిర్యాదులో ప్రస్తావించిన ఇతరుల పాత్రపైనా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో లభించే ఆధారాల మేరకు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.

