సింగరేణి బకాయిలను వెంటనే చెల్లించాలి
కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
కనీస పనిముట్లు, భద్రతా పరికరాలు అందడం లేదు
భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
కాకతీయ, భూపాలపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్నా సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఒక్కదానినీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. శనివారం భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని 8 ఇంక్లైన్ వద్ద బీఆర్‌ఎస్, టిబీజీకేఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కార్మికులకు కనీస పనిముట్లు, నాణ్యమైన భద్రతా పరికరాలు, షూస్ కూడా సక్రమంగా అందడం లేదన్నారు. కార్మికుల సంక్షేమం కంటే రాజకీయ జోక్యం, టెండర్లు, ఆర్థిక వ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం, జెన్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దాదాపు రెండేళ్లుగా డీఎంఎఫ్‌టీ నిధులు సక్రమంగా అందడం లేదన్నారు. కార్మికుల సమస్యలను ప్రశ్నిస్తే అడ్డుకోవడం, భయపెట్టడం ప్రజాస్వామ్య పద్ధతి కాదన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. తన గొంతును అడ్డుకున్నా కార్మికుల సమస్యలపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తప్పులను సరిదిద్దకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

