బీఆర్‌ఎస్.. బీజేపీ బాటలోనే
కేసీఆర్ దళితులను మోసం చేశారు
దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం
అసెంబ్లీకి రాకుండా బీఆర్‌ఎస్ రచ్చ
హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి
కాకతీయ,హన్మకొండ : బీఆర్‌ఎస్ బీజేపీని అనుసరిస్తోందని, దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అవమానించేలా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహరించడం క్షమించరాని నేరమని కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి అన్నారు. దళితులపై వివక్షకు పాల్పడుతున్న బీఆర్‌ఎస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ ప్రాంతంలో దళితులు నడిచిన నేలను బీఆర్‌ఎస్ కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అనాగరిక చర్యగా అభివర్ణించారు. అంటరానితనాన్ని ప్రోత్సహించేలా, మూఢనమ్మకాలను వ్యాప్తి చేసేలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
దళితులను కేసీఆర్ మోసం చేశారు
కేసీఆర్ మొదటి నుంచీ దళిత వ్యతిరేక వైఖరితో వ్యవహరించారని ఇనగాల వెంకట్రామిరెడ్డి విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళితులను దగా చేశారని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని మోసం చేశారని అన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రాజయ్యను కారణం లేకుండా ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి దళితులను అవమానించారని ఆరోపించారు. మంత్రివర్గంలో మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పడం ద్వారా దళితుల పట్ల తన వైఖరిని కేసీఆర్ బయటపెట్టుకున్నారని విమర్శించారు. దళిత సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను చూసి ఓర్వలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా తప్పించుకునేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద రచ్చ చేశారని ఇనగాల వెంకట్రామిరెడ్డి విమర్శించారు. బడికి వెళ్లని వారిని బడి దొంగలు అన్నట్లే.. అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను, కేసీఆర్‌ను ప్రజలు అసెంబ్లీ దొంగలుగా అంటున్నారని ఎద్దేవా చేశారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులు, అధికారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం దారుణమన్నారు. బీఆర్‌ఎస్ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థంగా తిప్పికొడుతోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజామోదం ఉందని, ప్రతి ఇంటికీ 10కి పైగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,19,931తో దేశంలో 2వ స్థానంలో ఉందని, త్వరలో 1వ స్థానానికి చేరుతుందని ఇనగాల వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు ప్రజామోదం ఉంది
బీఆర్‌ఎస్ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ వాటిని సమర్థంగా తిప్పికొట్టిందని డాక్టర్ కోటూరి మానవతారాయ్ అన్నారు. ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనకు 41.1 శాతం ప్రజామోదం లభించిందని చెప్పారు. ప్రతి ఇంటికీ 10కి పైగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మరో 10 ఏళ్లపాటు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి సర్కారును ప్రజలు దీవించనున్నారని అన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,19,931తో దేశంలో 2వ స్థానంలో ఉందని, త్వరలో కర్ణాటకను అధిగమించి 1వ స్థానానికి చేరుతుందని పేర్కొన్నారు. ఆర్థిక, ఆరోగ్య సూచీల్లో రాష్ట్రం ముందుకు సాగుతున్నట్లు ప్రపంచ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధ్రువీకరించాయని తెలిపారు. దీనిని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం హేయమైన రాజకీయమన్నారు. సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్, పెరుమాండ్ల రామకృష్ణ, బందెల భద్రయ్య, ఆరూరి సాంబయ్య, వీసం సురేందర్ రెడ్డి, మహమ్మద్ రహమతుల్లా, హర్షం అశోక్, మేడారపు సుధాకర్ నేత, అచ్చ వర్ష, రోషన్ గైక్వాడ్, కుమ్మరి రవి తదితరులు పాల్గొన్నారు.

