ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్
రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు!
హైదరాబాద్‌లో ఏఎంఆర్ గ్రూప్ కార్యాలయాలు, మహేశ్‌రెడ్డి ఇళ్లలో తనిఖీలు
ఢిల్లీ, కోల్‌కతా, ఝార్ఖండ్‌లోనూ ఏకకాలంలో దాడులు
మైనింగ్ కాంట్రాక్టులు, అనుమానాస్పద లావాదేవీలపై ఆరా
షెల్ కంపెనీలు, హవాలా లింకులపై దృష్టి
గతంలో ఐటీ తనిఖీల నేపథ్యంలో ఈడీ దర్యాప్తు
ఏఎంఆర్ అధినేత ఏ. మహేశ్‌రెడ్డిని టార్గెట్ చేసిన ఈడీ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : పశ్చిమ బెంగాల్ అక్రమ బొగ్గు మైనింగ్, నిధుల మళ్లింపు వ్యవహారం హైదరాబాద్‌లోని ప్రముఖ మౌలిక వసతుల సంస్థ ఏఎంఆర్ గ్రూప్ వరకు విస్తరించిందా? ఈ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏఎంఆర్ అధినేత ఏ. మహేశ్‌రెడ్డిని టార్గెట్‌గా దేశవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ కమలాపురి కాలనీలోని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయంతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని మహేశ్‌రెడ్డి నివాసాలు, అనుబంధ సంస్థల ప్రాంగణాల్లో ఈడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, కోల్‌కతా, ఝార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఉన్నతాధికారుల పర్యవేక్షణలో స్థానిక అధికారులు కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా మైనింగ్ కాంట్రాక్టులు, నిధుల ప్రవాహం, అనుమానాస్పద లావాదేవీలు, షెల్ కంపెనీల వ్యవహారాలపై దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.
రూ.650 కోట్ల నేరపూరిత రాబడి
ఈడీ దర్యాప్తులో ప్రధానంగా పశ్చిమ బెంగాల్ బొగ్గు అక్రమ రవాణా వ్యవహారం తెరపైకి వచ్చింది. ఝార్ఖండ్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్–అసన్సోల్ ప్రాంతాలకు అక్రమంగా బొగ్గును తరలిస్తూ, డెలివరీ ఆర్డర్ హోల్డర్లు, రవాణాదారుల నుంచి గుండా ట్యాక్స్, రంగదారి పన్నుల పేరుతో బొగ్గు సిండికేట్ గత 5 ఏళ్లలో రూ.650 కోట్లకు పైగా నేరపూరిత రాబడి ఆర్జించినట్లు ఈడీ ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. ఈ అక్రమ రవాణా ద్వారా వచ్చిన డబ్బు ఎక్కడికి చేరింది, ఏ సంస్థల ద్వారా బదిలీ అయింది, మైనింగ్ రంగంలో పనిచేస్తున్న సంస్థలతో వాటికి సంబంధాలున్నాయా అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
మైనింగ్ కాంట్రాక్టులపైనా ఆరా
ఏఎంఆర్ గ్రూప్ మైనింగ్ రంగంలో దేశవ్యాప్తంగా విస్తృతంగా కాంట్రాక్టులు నిర్వహించిన నేపథ్యంలో, గతంలో దక్కిన భారీ ప్రాజెక్టుల ఆర్థిక లావాదేవీలను ఈడీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. బొగ్గు, సున్నపురాయి, లిగ్నైట్, బాక్సైట్ వంటి ఖనిజాల ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌తో పాటు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, హైవేలు, పారిశ్రామిక నిర్మాణాల్లో ఏఎంఆర్ కార్యకలాపాలు కొనసాగించింది. సింగరేణి, కోల్ ఇండియా అనుబంధ సంస్థలతో పాటు ఇండియా సిమెంట్స్, గ్రాసిమ్ సిమెంట్స్ వంటి సంస్థలకు మైనింగ్ కాంట్రాక్టులు నిర్వహించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జలయజ్ఞం కింద పలు సాగునీటి కాల్వలు, బ్యారేజీ పనులు చేపట్టింది. నేపాల్, భూటాన్‌లోనూ మౌలిక వసతుల పనులు నిర్వహించిన సంస్థగా ఏఎంఆర్‌కు విస్తృత వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయి. ఈ క్రమంలో గత కాంట్రాక్టులకు సంబంధించిన నిధుల బదిలీలు, అనుబంధ సంస్థల లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
రూ.60 కోట్ల లావాదేవీలపై దృష్టి
మైనింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారాల్లో దాదాపు రూ.60 కోట్లకు పైగా విలువైన అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు సంస్థల దృష్టికి వచ్చినట్లు సమాచారం. షెల్ కంపెనీల ద్వారా నిధుల ప్రవాహం, అక్రమ నగదు చలామణి, హవాలా లావాదేవీలకు సంబంధించిన లింకులను గుర్తించేందుకు ఈడీ అధికారులు పత్రాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆదాయపు పన్ను శాఖ కూడా ఏఎంఆర్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఆ తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన ఆర్థిక లావాదేవీలు, పత్రాలు, ఇతర వివరాల ఆధారంగా ఈడీ దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.
లంచాల చెల్లింపుల కోణంలోనూ విచారణ
పశ్చిమ బెంగాల్ అక్రమ బొగ్గు మైనింగ్ వ్యవహారంలో అక్రమ రవాణా నిరాటంకంగా సాగేందుకు స్థానిక రాజకీయ ప్రముఖులు, కొందరు ప్రభుత్వ అధికారులకు భారీగా లంచాలు చెల్లించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ కేసులో ఈడీ ఇప్పటికే ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అరెస్టయిన చిన్మయ్ మోండల్, కిరణ్ ఖాన్‌లతో పాటు మరో ముగ్గురి పేర్లను అందులో చేర్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నేరపూరిత రాబడి ఎలా సృష్టించబడింది, దాన్ని ఏ మార్గాల్లో మళ్లించారు, ఆ నిధులకు ఇతర వ్యాపార సంస్థలు లేదా వ్యక్తులతో సంబంధం ఉందా అనే అంశాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
పాపిరెడ్డిపాళెం నుంచి బంగారు రెడ్డిగా
నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన ఏ. మహేశ్‌రెడ్డి 1992లో తన సోదరుడు గిరీష్రెడ్డితో కలిసి ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ పేరుతో వ్యాపార ప్రస్థానం ప్రారంభించారు. చిన్న భాగస్వామ్య సంస్థగా మొదలైన వ్యాపారం తర్వాత వేల కోట్ల టర్నోవర్‌తో ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్‌గా విస్తరించింది. వ్యాపార రంగంతో పాటు సినీ నిర్మాతగా కూడా మహేశ్‌రెడ్డి వ్యవహరించారు. షిర్డీ సాయిబాబా సంస్థాన్‌కు 145 కిలోల బంగారంతో సింహాసనం, బంగారు తొడుగులు విరాళంగా ఇవ్వడంతో బంగారు రెడ్డి అనే గుర్తింపు పొందారు. గతంలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ట్రస్టీగా సేవలందించారు. ఈ నేపథ్యం, దేశవ్యాప్తంగా ఉన్న మైనింగ్ కాంట్రాక్టులు, ప్రస్తుత బొగ్గు కేసు దర్యాప్తు నేపథ్యంలో ఏఎంఆర్ గ్రూప్‌పై ఈడీ సోదాలు వ్యాపార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సోదాల్లో లభించిన పత్రాలు, ఆర్థిక రికార్డుల ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది.

