రోడ్డుపై బిల్డింగ్ నిర్మాణం
రోడ్డును కబ్జా చేస్తూ కన్‌స్ట్రక్షన్
అక్రమ నిర్మాణంపై చూసి చూడనట్లుగా జీడబ్ల్యూఎంసీ టౌన్ ప్లానింగ్
అధికారుల అండతోనే రెచ్చిపోతున్న బిల్డర్లు
ఉర్సుగుట్ట శ్రీలక్ష్మి కార్ జోన్ పక్కన భవంతి
30 అడుగుల రోడ్డును మింగేసిన నిర్మాణం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. మాస్టర్ ప్లాన్, నిబంధనలు, జీవోలు అన్నీ తుంగలో తొక్కుతూ కొందరు నిర్మాణదారులు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. నగరం నడిబొడ్డున, అధికారుల కళ్లెదుటే అక్రమ కట్టడాలు పుట్టుకొస్తున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉర్సుగుట్ట సమీపంలోని శ్రీలక్ష్మి కార్ జోన్ పక్కనే జరుగుతున్న భారీ భవన నిర్మాణం. సుమారు 30 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డుకు కనీసం అడుగు కూడా సెట్ బ్యాక్ వదలకుండా భవనాన్ని లేపేస్తున్నారు. అసలు రోడ్డు స్థలాన్ని సైతం తమ స్థలంలో కలుపుకుని పిల్లర్లు వేయడం చూసి కాలనీ వాసులు నివ్వెరపోతున్నారు. దీంతో రోడ్డు వెడల్పు సగానికి సగం తగ్గిపోయి, వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి ఏర్పడింది.
అత్యవసర సేవలకు తీవ్ర ముప్పు
రోడ్డు ఆక్రమణ వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని కాలనీ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్, ఫైర్ ఇంజన్, పోలీసు వాహనాలు కాలనీలోకి రావాలంటేనే కష్టం. ఒకవేళ అగ్నిప్రమాదం జరిగినా, ఎవరికైనా ఆరోగ్యం విషమించినా సహాయం అందేలోపే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు. “రోడ్డు మాది, ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాం ఆపేదెవరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నగరాభివృద్ధి నిబంధనల ప్రకారం ప్రతి భవనానికి సెట్ బ్యాక్ తప్పనిసరి. దీనివల్ల డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి పైపులైన్లు, విద్యుత్ లైన్లు, రోడ్డు విస్తరణ వంటి ప్రజా మౌలిక వసతులు కల్పించడం సులభమవుతుంది. కానీ ఈ నిర్మాణంలో ఆ స్థలాన్నే మింగేయడంతో భవిష్యత్తులో డ్రైనేజీ కాలువలు ఎక్కడ వేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే వర్షాకాలంలో ఆ వీధి చెరువును తలపిస్తోందని, ఇకపై మురుగునీరు ఇళ్లలోకి వచ్చే పరిస్థితి వస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మామూళ్ల బాగోతమా?
అసలు విస్మయం కలిగించే అంశం ఏంటంటే, నిర్మాణం పునాది దశ నుంచే టౌన్ ప్లానింగ్ అధికారులు, కార్పొరేషన్ సిబ్బంది పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వెంటనే నోటీసు ఇచ్చి నిలిపివేయాలి. సాధారణంగా ఇంటి ముందు చిన్న షెడ్ వేసినా వచ్చి అడ్డుకునే అధికారులు, ఈ భారీ భవనం దాదాపు పైకప్పు దశకు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కొందరు అధికారుల అండదండలతోనే, భారీ మామూళ్ల మతలబుతోనే ఈ అక్రమ నిర్మాణం సాగుతోందా అనే చర్చ కాలనీలో జోరుగా సాగుతోంది. నిబంధనలు పాటించే వారికంటే ఉల్లంఘించే వారికే ప్రాధాన్యం లభిస్తోందనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోతోంది.
కమిషనర్ జోక్యం చేసుకోవాలి
ఈ అక్రమ నిర్మాణంపై జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, రోడ్డు ఆక్రమణ ఉంటే వెంటనే కూల్చివేత చర్యలు చేపట్టాలని, బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

