కేంద్రం వాటా దాచిపెట్టి.. ఇప్పుడు మాటల గారడీనా?
ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
కేంద్రం, రాష్ట్రం వాటాల వివరాలు ప్రజలకు వెల్లడించాలి
బీజేపీ గీసుగొండ మండల అధ్యక్షుడు కొంగర రవికుమార్ డిమాండ్
కాకతీయ, గీసుగొండ : ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల పెండింగ్‌పై వస్తున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కేంద్రం వాటా పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ గీసుగొండ మండల అధ్యక్షుడు కొంగర రవికుమార్ ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి కేంద్రం ఇళ్ల కేటాయింపులు, ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని ఇప్పటివరకు ప్రజలకు ఎందుకు స్పష్టంగా చెప్పలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్న వాస్తవాన్ని దాచిపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రచారం చేసి లబ్ధిదారులను ప్రభావితం చేశారని ఆరోపించారు. ఇప్పుడు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కేంద్రం వాటా పేరుతో వివరణలు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి మరిన్ని ఇళ్లు మంజూరు చేయాలని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం, రాష్ట్రం వాటాలు ఎంతన్నది జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో అధికారులు ప్రజలకు అధికారికంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. నిధులను పక్కదారి పట్టించకుండా ఇళ్ల నిర్మాణానికే వినియోగించి, లబ్ధిదారుల ఖాతాల్లో పెండింగ్ బిల్లులను వెంటనే జమ చేయాలని రవికుమార్ కోరారు.

