సీరత్ ఎక్స్‌పోకు ఎంఐఎం సేవలు
మూడు రోజులపాటు సీరత్ ఎక్స్‌పో-2026 నిర్వహణ
30 వేల మందికి తాగునీటి వసతి
ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ వెల్లడి
కాకతీయ, కరీంనగర్ : జమాతే ఇస్లామీ హింద్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీరత్ ఎక్స్‌పో-2026కు ఎంఐఎం పార్టీ తరఫున సేవలు అందిస్తామని ఎంఐఎం కరీంనగర్ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తెలిపారు. శుక్రవారం సర్కస్ గ్రౌండ్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే మైదానంలో నిర్వహించిన ఎక్స్‌పో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మూడు రోజులపాటు నిర్వహించే సీరత్ ఎక్స్‌పోలో ఇస్లాం గురించి అవగాహన కల్పించే స్టాల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఎక్స్‌పోకు వచ్చే సుమారు 30 వేల మందికి ఎంఐఎం కరీంనగర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తాగునీటి వసతి కల్పించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ ఊట్కూరు నరేందర్‌రెడ్డి, జమాతే ఇస్లామీ జిల్లా అధ్యక్షుడు సోహైబ్ అహ్మద్‌ఖాన్, లక్ష్ విద్యాసంస్థల చైర్మన్ ముష్తాఖ్ అహ్మద్, ముఫ్తి నదీమోద్దీన్, ఎంపీజే జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, షోయబ్ లతీఫీ, ఖైరోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

