స్పెషల్ బ్రాంచ్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ!
వివిధ విభాగాల పనితీరుపై సమీక్ష
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాలు
కాకతీయ, కరీంనగర్ : స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో విధుల నిర్వహణ, వివిధ విభాగాల పనితీరును కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించడంతోపాటు ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పాస్‌పోర్టు, ఉద్యోగ ధ్రువీకరణ, పోలీస్ వెరిఫికేషన్ ధ్రువపత్రాల జారీ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్దేశిత గడువులోగా వెరిఫికేషన్ పూర్తి చేసి ధ్రువపత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియా విభాగం పనితీరు, క్షేత్రస్థాయి అధికారుల కార్యాచరణను సమీక్షించారు. ఫీల్డ్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సమాచార సేకరణను వేగవంతం చేయాలని సూచించారు. విధుల పట్ల అలసత్వం వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులపై తక్షణమే స్పందించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ అనిల్, డీఏవో విరాజ్, ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

