ఆక్రమణలపైనే రోడ్డు వేస్తారా?
ఆక్రమణలు తొలగించకుండానే రోడ్డు నిర్మాణానికి అధికారుల హడావుడి
కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
62వ డివిజన్ విష్ణుపురి, కాజీపేట వాసులు ఆవేదన
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : 30 అడుగుల రహదారిని ఆక్రమణలతో 10–12 అడుగులకు కుదించేసి, అదే స్థలంలో రోడ్డు నిర్మాణానికి అధికారులు సిద్ధమవుతున్నారని 62వ డివిజన్ విష్ణుపురి, కాజీపేట వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు తొలగించకుండా రోడ్డు వేస్తే అవి శాశ్వతమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటూ కాలనీవాసి కె. జాన్, ఇతరులు సోమవారం బల్దియా గ్రీవెన్స్‌లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌కు అత్యవసర వినతిపత్రం సమర్పించారు. 25-4-667, 25-4-602 ఇళ్ల మధ్య ఉన్న రహదారి అసలు వెడల్పు 30 అడుగులు కాగా, అనధికార కట్టడాలు, కాంపౌండ్ వాల్స్‌తో ప్రస్తుతం 15 అడుగులకు, కొన్ని చోట్ల 10–12 అడుగులకు కుదించుకుపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అంబులెన్స్, అగ్నిమాపక, మున్సిపల్ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. 08-06-2026న అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్. రామన్నకు దరఖాస్తు నెం.62251, 19-06-2026న కలెక్టర్‌కు, 24-06-2026న రిమైండర్, 23-07-2026న ఫిర్యాదు రిఫరెన్స్ నెం.62012, దరఖాస్తు నెం.ఈ154042 ద్వారా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు తెలిపారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ కమిషనర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని, మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. కనకమ్మ ఇంటి నుంచి ఆవుల వెంకటయ్య ఇంటి వరకు కమిషనర్ స్వయంగా పరిశీలించాలని కోరారు. ఆక్రమణలపై రోడ్డు పనులు నిలిపివేసి, అనధికార కట్టడాలు తొలగించి, ఆమోదిత ప్లాన్ ప్రకారం రహదారిని 30 అడుగులకు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

