కాంగ్రెస్ నుంచి ఐదుగురి బహిష్కరణ
లక్ష్మణ్ నాయక్‌పై దాడి ఘటనలో క్రమశిక్షణ చర్యలు
హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల ఉత్తర్వులు
కాకతీయ, హనుమకొండ : వేలేర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్‌పై జరిగిన దాడి ఘటనలో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన 5 మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించినట్లు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. లక్ష్మణ్ నాయక్‌పై జరిగిన దాడికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 25న తాను లేఖ సమర్పించగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో టీపీసీసీకి నివేదిక పంపినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా డీసీసీ కార్యవర్గ సభ్యుడు మహమ్మద్ సద్దాం హుస్సేన్, మాజీ వార్డు మెంబర్ బైరి అనిల్, 14వ వార్డు మెంబర్ అందె కృపాసాగర్, పార్టీ కార్యకర్త కుర్సపెల్లి హరీష్, మాజీ సోషల్ మీడియా మండల ఇన్‌చార్జ్ మహమ్మద్ సలీం మాలిక్‌లను పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించినట్లు ఇనగాల వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే ప్రతి కార్యకర్త, నాయకుడికి పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉందని, క్రమశిక్షణను ఉల్లంఘించి అరాచకాలకు పాల్పడితే ఎంతటి వారిపైనైనా పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

