అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయి
మొలంగూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ
కాకతీయ,శంకరపట్నం: ఉపాధ్యాయులకు లభించే అవార్డులు మరింత బాధ్యతతో పనిచేయడానికి ప్రోత్సాహాన్ని అందిస్తాయని, అవార్డులతో బాధ్యత మరింత పెరుగుతుందని మొలంగూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ అన్నారు. మొలంగూర్ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఇటీవల వివిధ సందర్భాల్లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులను అభినందిస్తూ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు నీరజ మాట్లాడుతూ అవార్డులు వ్యక్తిగత గుర్తింపుతో పాటు విద్యార్థుల పట్ల మరింత బాధ్యతగా పనిచేయాలనే స్ఫూర్తిని కలిగిస్తాయని పేర్కొన్నారు. ఇటీవల మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న బాబు సార్ను, లయన్స్ క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న శారదను ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయ సిబ్బంది శాలువాలు, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. అలాగే జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ‘ఉత్తమ విద్యా సారథి’ పురస్కారం అందుకున్న ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజను ఉపాధ్యాయ బృందం శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించింది.
ఈ సందర్భంగా నీరజ ఇటీవల పాఠశాలలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ విద్యార్థులు మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, మంత్రాలు, తాయత్తులు, కనికట్టు వంటి వాటిని నమ్మకూడదని సూచించారు. ఆధునిక కాలంలో శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని, ఎవరైనా ఇటువంటి విషయాలను చెబితే వాటిని నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయురాలు నీరజ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. అలాగే పురస్కారాలు అందుకున్న బాబు, శారదల సేవలను కొనియాడారు.

