రైస్ మిల్లర్ల ఎన్నికల వేళ సీఐడీ కలకలం
అధ్యక్ష పోరులో అనూహ్య మలుపు
అదుపులోకి బాదం ప్రవీణ్
కాంగ్రెస్‌లో రెండు వర్గాల మద్దతు
ఓటు కోసం ములుగుకు తరలింపు?
కాకతీయ, ములుగు: జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల వేళ సీబీ సీఐడీ చర్యలు తీవ్ర ఉత్కంఠకు తెరలేపాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న బాదం ప్రవీణ్‌ను ఆదివారం తెల్లవారుజామున జాకారం సమీపంలోని జాతీయ రహదారిపై అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా ఆయన కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సిన తరుణంలో అధ్యక్ష అభ్యర్థి అదుపులోకి రావడం ఎన్నికల ప్రక్రియపై ఆసక్తిని పెంచింది. ఇదిలా ఉండగా ప్రవీణ్‌తో పాటు మరికొందరు రైస్ మిల్లర్లను హన్మకొండలోని సీఐడీ కార్యాలయం నుంచి ములుగుకు తీసుకువస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకే వారిని ములుగుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇతర మిల్లర్ల వివరాలు, తరలింపునకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

అధ్యక్ష పీఠం కోసం ఇద్దరి మధ్య పోటీ.. కాంగ్రెస్‌లో వేర్వేరు శిబిరాలు
ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పస్రాకు చెందిన సతీష్, బాదం ప్రవీణ్ పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు వేర్వేరు అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నాయనే ప్రచారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సతీష్ గెలుపు కోసం కాంగ్రెస్‌లోని ఓ కీలక వర్గం శనివారం మిల్లర్లతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశానికి 51 మంది అర్హులైన ఓటర్లలో 42 మంది హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రవీణ్ విజయానికి పార్టీలోని మరో వర్గం మద్దతుగా ఉన్నట్లు స్థానికంగా చర్చ సాగుతోంది. సంఘంలో మొత్తం 52 మంది సభ్యులు ఉండగా వారిలో 15 మంది ప్రవీణ్ వర్గానికి మద్దతుగా ఉన్నట్లు సమాచారం. ఒకే పార్టీలోని వేర్వేరు వర్గాలు వేర్వేరు అభ్యర్థుల పక్షాన నిలుస్తున్నాయనే ప్రచారం ఎన్నికల పోరును మరింత ఆసక్తికరంగా మార్చింది.
మిల్లుల్లో తనిఖీలు.. సీఐడీ అదుపులోకి తీసుకోవడంతో చర్చ
బాదం ప్రవీణ్‌కు చెందిన ములుగు మండలంలోని రెండు రైస్ మిల్లులతో పాటు మరో నాలుగు మిల్లుల్లో ఇటీవల పౌరసరఫరాల విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. అంతకుముందు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూడా తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రవీణ్‌ను సీబీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరాలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం సరఫరాలో నిబంధనల ఉల్లంఘనలు, కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రవీణ్‌ను ఏ కేసులో భాగంగా అదుపులోకి తీసుకున్నారు? ఆయనపై ఉన్న నిర్దిష్ట అభియోగాలేమిటి? అనే అంశాలపై అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
పోలింగ్ వేళ ఉత్కంఠ.. హన్మకొండ నుంచి ములుగుకు తరలింపు..?
అధ్యక్ష ఎన్నికలకు కొన్ని గంటల ముందు బాదం ప్రవీణ్ అదుపులోకి తీసుకోవడం, ఆయనతో పాటు మరికొందరు మిల్లర్లను హన్మకొండ సీఐడీ కార్యాలయం నుంచి ములుగుకు తీసుకువస్తున్నారనే సమాచారం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకే వారిని ములుగుకు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ తరలింపుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రవీణ్‌తో పాటు తరలిస్తున్న ఇతర మిల్లర్ల వివరాలు, పోలింగ్‌లో వారి భాగస్వామ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఒకవైపు అధ్యక్ష పదవికి పోటీ, మరోవైపు కాంగ్రెస్ వర్గాల మద్దతుపై ప్రచారం ఇంకోవైపు ఎన్నికల వేళ సీఐడీ చర్యలతో ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. అధికారుల నుంచి వెలువడే తదుపరి సమాచారం, ఎన్నికల నిర్వహణలో చోటుచేసుకునే పరిణామాలపై మిల్లర్లలో ఆసక్తి నెలకొంది.

