దసరాకు ఇస్తామన్న డీఏలు ఏమయ్యాయి?
యూత్ డిక్లరేషన్, మెగా డీఎస్సీ హామీలు ఏమయ్యాయి?
ఉద్యోగులు, నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నాం
పట్టభద్రుల ఓటే కాంగ్రెస్ వైఫల్యాలకు అస్త్రం
నవంబర్ 6లోపు ఓటరుగా నమోదు చేసుకోండి
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి
కాకతీయ, హన్మకొండ : పట్టభద్రుల ఓటు నమోదును కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అస్త్రంగా మలచుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు నవంబర్ 6లోపు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా తమ తీర్పును వెల్లడించాలని కోరారు. ఆదివారం కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో మార్నింగ్ వాక్‌లో పాల్గొన్న రాకేష్‌రెడ్డి పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఫారం–18 అందజేశారు. అనంతరం ఉచిత ఓటరు నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కీలకమైన అవకాశమన్నారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయలేదని రాకేష్‌రెడ్డి విమర్శించారు. యూత్ డిక్లరేషన్, మెగా డీఎస్సీ, ఉద్యోగ క్యాలెండర్, నిరుద్యోగ భృతి హామీలను నెరవేర్చకుండా నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేశారని మండిపడ్డారు. దసరాకు విడుదల చేస్తామన్న కరువు భత్యం ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యాలు, వేతన సవరణ సంఘం ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడం లేదని రాకేష్‌రెడ్డి అన్నారు. పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందినప్పటికీ బీఆర్ఎస్ ప్రజలకు దూరం కాలేదని, ఉద్యోగులు, నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై నిరంతరం పోరాడుతోందని తెలిపారు. ఓటరు నమోదుకు ఆన్‌లైన్‌లో ceotelangana.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, గ్రామాల్లోని బీఆర్ఎస్ కార్యకర్తల సహకారం కూడా తీసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

