పింఛన్ల మంజూరుకు పైసల వసూళ్లు..?
ఒక్కొక్కరి నుంచి రూ.1,300 నుంచి రూ.1,500 వరకు డిమాండ్
కాకతీయ, గీసుగొండ : పేదలకు ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పింఛన్ల మంజూరుకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గీసుగొండ మండలం ఏలుకుర్తి హవేలీ గ్రామంలో కలకలం రేపుతున్నాయి. కొత్త పింఛన్లు మంజూరు చేయించేందుకు ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.1,300 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆపరేటర్‌కు ఇవ్వాలంటూ గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ ద్వారా ఈ వసూళ్లు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో సర్పంచ్ జను దివ్యభారతి పేరును కూడా ప్రస్తావించిన ఆడియో సంభాషణలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. పింఛన్ల మంజూరుకు డబ్బులు వసూలు చేస్తున్నారా? ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉంది? అనే అంశాలపై అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వసూళ్లకు సంబంధించిన ఆధారాలను పరిశీలించి వాస్తవాలను వెలికితీయాలని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

