ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేయాలి!
పెండింగ్ పనులపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష
కాకతీయ, పరకాల : పరకాలలోని 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయితో కలిసి నూతన ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, వైద్యాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పాత భవనం నుంచి నూతన భవనానికి బ్లడ్ బ్యాంకును తరలించి అవసరమైన సదుపాయాలు కల్పించాలని, సీటీజీ యంత్రంతో పాటు అత్యవసర వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వైద్యుల సేవలు 24 గంటలు అందేలా చూడాలని, గైనకాలజీ వార్డు, లేబర్ రూమ్‌లో వసతులు మెరుగుపరిచి సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని స్పష్టం చేశారు.
వైద్య సేవలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ఓపీ, ఐపీ సేవలను విస్తరించాలని, ఆర్వో వాటర్ ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ-ఔషధి, ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ సేవలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు, అధికారులకు సూచించారు. పీఎం రాహత్ పథకం అమలుపై కూడా చర్చించారు. సమావేశంలో ఆర్డీవో డీఎస్ వెంకన్న, డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ పవన్, ఆర్ఎంవోలు డాక్టర్ నారాయణరెడ్డి, డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ ప్రవీణ్, ఇతర వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.

