ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి
రెవెన్యూ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టొద్దు
క్షేత్రస్థాయి విచారణ వేగవంతం చేయాలి
: ఎమ్మెల్యే రేవూరి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
కాకతీయ, హనుమకొండ : ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించి, ఏ ఒక్క దరఖాస్తును పెండింగ్‌లో ఉంచవద్దని సూచించారు. గురువారం పరకాల ఆర్డీవో కార్యాలయంలో వివిధ రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూ రీ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, రెవెన్యూ దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. దరఖాస్తుల పరిష్కార వివరాలను సంబంధిత దరఖాస్తుదారులకు తప్పనిసరిగా తెలియజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో వెంకన్న, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

