వార్డు అధికారిపై సస్పెన్షన్ వేటు..!
43వ డివిజన్, కాశీబుగ్గ వార్డు అధికారి గఫార్ ఖాన్ సస్పెండ్
ప్రత్యేక అధికారి చాహత్ బాజ్ పాయ్ ఉత్తర్వులు
రూ.1,13,452 ఆస్తి పన్ను సొంతానికి వినియోగం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజాధనం విషయంలో అవకతవకలకు పాల్పడిన 43వ డివిజన్, కాశీబుగ్గ సర్కిల్-1 వార్డు అధికారి ఎంఏ గఫార్ ఖాన్ పై సస్పెన్షన్ వేటు పడింది. వసూలు చేసిన రూ.1,13,452 ఆస్తి పన్ను మొత్తాన్ని మున్సిపల్ ఖజానాలో జమ చేయకపోవడంపై ప్రత్యేక అధికారి, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను డబ్బును ఖజానాకు జమ చేయకుండా చేతిలో పెట్టుకోవడమే ఈ అధికారి పాలిట శాపంగా మారిందని మున్సిపల్ వర్గాలు అంటున్నాయి. దీనిని తీవ్ర ఆర్థిక క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణించి, సమగ్ర విచారణ నిమిత్తం సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో ఆ అధికారి హన్మకొండలోనే ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉండాలని, అనుమతి లేకుండా కేంద్రాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశించారు. తన వద్ద ఉన్న మున్సిపల్ రికార్డులు, పన్ను వసూలు రిజిస్టర్లు, రశీదు పుస్తకాలు, నగదు తదితరాలను వెంటనే సంబంధిత అధికారులకు అప్పగించాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆదాయం విషయంలో ఎలాంటి అవకతవకలు, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఈ చర్య ద్వారా ప్రత్యేక అధికారి స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో ఏసీ, కమిషనర్లు మందలించినా సదరు వార్డు అధికారి సరిచేసుకోకపోవడంతో విషయం ఉన్నతాధికారి దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.

