గ్రామంలో వివాదాలకు అజ్ఞాత వ్యక్తే కారణం!
సర్పంచ్‌ను పావుగా ఉపయోగించుకుంటూ గొడవలకు ఆజ్యం
సొంత వర్గీయులను కాపాడుకునేందుకే సీఐపై ఆరోపణలు
గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మర్రి క్రాంతికుమార్ డిమాండ్
కాకతీయ, గీసుగొండ : మనుగొండ గ్రామంలో కొంతకాలంగా చోటుచేసుకుంటున్న వివాదాల వెనుక గ్రామంలో నివసించని ఓ అజ్ఞాత వ్యక్తి ప్రోద్బలం ఉందని గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మర్రి క్రాంతికుమార్ ఆరోపించారు. తన వర్గీయులను కాపాడుకునేందుకు సీఐ విశ్వేశ్వర్పై తప్పుడు ఆరోపణలు చేయిస్తూ గ్రామంలో విద్వేషాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. గీసుగొండ మండలంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్‌ను పావుగా ఉపయోగించుకుంటూ గ్రామ సమస్యల పరిష్కారంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని క్రాంతికుమార్ ఆరోపించారు. ఇరువర్గాల మధ్య వివాదాలు ముదరకుండా సీఐ విశ్వేశ్వర్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వారి వాదనలు విన్నారని, సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించారని తెలిపారు. విచారణలో వాస్తవాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే సీఐపై ఆరోపణలు చేస్తూ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. మనుగొండలో నెలకొన్న వివాదాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి ఇరువర్గాల వాదనలు వినాలని కోరారు. సీఐపై వచ్చిన ఆరోపణలను కూడా ఆధారాలతో పరిశీలించి, నిజమైన బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో శాంతిసామరస్యాలు నెలకొనాలని, చట్టం ముందు అందరూ సమానమేననే సూత్రం అమలుకావాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శులు కొమ్ము శ్రీకాంత్, నాకినబోయిన నాగరాజు, మనుగొండ వార్డు సభ్యుడు మూగల ప్రదీప్, మండల నాయకుడు కందికొండ రాజు, మహిళా అధ్యక్షురాలు మాదాసి కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

