ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్‌వో తనిఖీలు
వైద్య సేవలు, టీకాల కార్యక్రమం అమలుపై పరిశీలన
కాకతీయ, హనుమకొండ : జిల్లాలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అమలు తీరును వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య న్యూ శాయంపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. చిన్నారులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు అందించాలని సిబ్బందికి సూచించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కృష్ణారావు ధర్మసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కరుణాపురం ఉపకేంద్రం, మడికొండలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను పరిశీలించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రదీప్‌రెడ్డి హసన్‌పర్తి అప్‌గ్రేడెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించవద్దని డాక్టర్ అప్పయ్య సిబ్బందిని ఆదేశించారు. అన్ని రికార్డులు, రిజిస్టర్లను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

