డంపింగ్ యార్డ్ పాపం కాంగ్రెస్‌దే
జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తే ఊరుకోం
ప్రజలు, వన్యప్రాణులకు హాని
నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి
సిర్సపల్లి–రంగాపూర్ సమీపంలో స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి
హుజూరాబాద్ ప్రజలతో కలిసి ఉద్యమానికి బీజేపీ సిద్ధమంటూ వ్యాఖ్య
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : హుజూరాబాద్ సమీపంలో డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదనకు గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులే కారణమని ఆరోపిస్తూ… ఇప్పుడు అదే పార్టీలు వ్యతిరేకించడం ఆశ్చర్యకరమన్నారు. జనావాసాల మధ్యలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం ప్రజల ఆరోగ్యానికి హానికరమని, ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. “ఒక సమస్యను పరిష్కరించడానికి మరో సమస్యను సృష్టించడం సరికాదు” అని స్పష్టం చేశారు.
స్థల పరిశీలనలో వెలుగులోకి సమస్యలు
బీజేపీ నేతలతో కలిసి సిర్సపల్లి, రంగాపూర్ సమీపంలోని డంపింగ్ యార్డు స్థలాన్ని సంజయ్ పరిశీలించారు. ఈ ప్రాంతం జనావాసాలకు సమీపంలో ఉండటంతో పాటు గుట్టల్లో నెమళ్లు, పక్షులు సహా వన్యప్రాణులు సంచరిస్తున్నాయని స్థానికులు వివరించారు. ఇక్కడ చెత్త యార్డు ఏర్పాటు చేస్తే ప్రజల ఆరోగ్యంతో పాటు వన్యప్రాణులకు కూడా ముప్పు తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ శివారులో ఇప్పటికే ప్రభావం ఉన్నప్పటికీ… కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేయడం మరింత ప్రమాదకరమని పేర్కొన్నారు.
సీఎం నిర్ణయం పునఃపరిశీలించాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం మార్చుకోవాలని కోరారు. లేనిపక్షంలో హుజూరాబాద్ ప్రజలతో కలిసి బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. డంపింగ్ యార్డు నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం ఇల్లందకుంటలో జరిగిన సీతారామచంద్రస్వామి రథోత్సవంలో పాల్గొన్నారు.

