ప్రతీ గింజను కొంటాం… దళారులను నమ్మి మోసపోవద్దు
* ప్రతిపక్షాలకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు
* మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి కనకయ్య
కాకతీయ, చేర్యాల: రైతులు పండించిన ధాన్యం, మొక్కజొన్నలను దళారులకు విక్రయించకుండా వ్యవసాయ మార్కెట్ లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి కనకయ్య అన్నారు. ఈ సందర్బంగా కనకయ్య మాట్లాడుతూ..సజావుగా సాగుతున్న కొనుగోళ్లను చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక అవాకులు చవాకులు పేలుతున్నాయని విమర్శించారు. రైతుల గురించి ప్రతిపక్షాలకు మాట్లాడిన నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల్లో స్థలం కొరత, ట్రాన్స్పోర్ట్ వాహనాల ఇబ్బంది, హమాలీలు, ఆపరేటర్లు, కూలీల కొరత ఉన్నా.. అన్నింటినీ అధిగమిస్తూ అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా సజావుగా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. అకాల వర్షాలకు తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలున్నాయని, రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దని కనకయ్య కోరారు.
ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని వెల్లడించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ప్రతిపక్షాలు తట్టుకోలేక రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డును అందించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులను అందిస్తున్నామని అదేవిధంగా మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ళను నిర్మిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో రెండో విడతలు మరింత మంది ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామన్నారు.

