ఎన్‌హెచ్-563 పనుల వేగం పెంచాలి
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఎమ్మెల్యే సత్యం వినతి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి (ఎన్‌హెచ్-563) విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కోరారు. బుధవారం ఢిల్లీలో జరిగిన భేటీలో రహదారి పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం పనులు మందగించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలను కలిపే ఈ ప్రధాన రహదారి పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వాణిజ్యం, వ్యవసాయ రంగాలకు ఊతం లభిస్తుందని వివరించారు.
దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి సంబంధిత అధికారులతో చర్చించి పనులను వేగవంతం చేయించే దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

