అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ
డ్రైవర్లకు కంటి పరీక్షలు తప్పనిసరి
అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో రోడ్ సేఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. డ్రైవర్లు కంటి పరీక్షలు, శారీరక పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఆర్టీసీ ఆర్ఎం రాజు మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను వినియోగించాలని సూచించారు. రవాణా శాఖ ఉప కమిషనర్ పెద్దింటి పురుషోత్తం మాట్లాడుతూ అతివేగం, అజాగ్రత్త, నిద్రలేమి, మైనర్లు వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ప్రమాదరహిత సమాజానికి సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వెంకటరమణ, ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్, డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి, ఆర్డీవో మహేశ్వర్, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, కళాశాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

