నల్ల బ్యాడ్జీలతో మునిసిపాలిటీ ఉద్యోగుల నిరసన
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు శుక్రవారం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యచరణ సమితి మరియు తెలంగాణ మున్సిపల్ సెంట్రల్ ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో అన్ని విభాగాల ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ సెంట్రల్ ఫోరం జిల్లా వైస్ ప్రెసిడెంట్ రావుల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగులందరికీ స్మార్ట్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన 63 డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్‌కు అందజేశారు. ఈ నిరసనలో మున్సిపాలిటీకి చెందిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

