మేడారం ప్రమాద బాధిత బాలుడికి ఆర్థిక సాయం
దేవాదాయ శాఖ నుంచి చెక్కు అందజేత
తల్లికి ఉద్యోగం… నెలకు స్థిర వేతనం
కృత్రిమ కాలు, వాహనం అందజేయనున్నట్లు మంత్రి సీతక్క హామీ
కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడ్డ బాలుడి కుటుంబానికి ప్రభుత్వం సహాయ హస్తం అందించింది. శనివారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా దేవాదాయ శాఖ తరఫున ఆర్థిక సహాయం చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి విడుదల చేసిన ప్రకటనలో, ప్రమాదం జరిగిన వెంటనే బాలుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి అత్యుత్తమ వైద్యం అందించామని తెలిపారు. చికిత్సకు సంబంధించిన మొత్తం ఖర్చును ప్రభుత్వం భరించిందని పేర్కొన్నారు. బాలుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతని పేరుతో ఆర్థిక సహాయాన్ని స్థిర నిక్షేపంగా బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు. దీంతో పాటు కుటుంబ పోషణ కోసం బాలుడి తల్లికి దేవాదాయ శాఖలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించి నెలకు పదెనిమిది వేల రూపాయల వేతనం అందజేస్తామని వెల్లడించారు. బాలుడు పూర్తిగా కోలుకున్న అనంతరం అతనికి నాణ్యమైన కృత్రిమ కాలు అమర్చడంతో పాటు సౌకర్యార్థం వాహనం కూడా అందజేస్తామని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధ బోయిన జగ్గారావు, బాలుడి తల్లిదండ్రులు, ఇతరులు పాల్గొన్నారు.

