పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
సీపీఎస్, ఎన్పీఎస్ రద్దు చేయాలి
పాత పెన్షన్ విధానమే అమలు చేయాలి
‘వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్’ను వెంటనే ఉపసంహరించుకోవాలి
టీఏపీఆర్పీఏ జిల్లా అధ్యక్షుడు జనార్ధన్ డిమాండ్
కాకతీయ, కరీంనగర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్ల ప్రధాన డిమాండ్లతో కూడిన మెమోరాండంను ప్రధానమంత్రి కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా పంపించారు. పెన్షనర్ల హక్కులను కాపాడటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ.. పెన్షనర్ల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారిన ‘వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ (మార్చి-2025)’ను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2004 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులందరికీ సీపీఎస్, ఎన్పీఎస్, యూపీఎస్ వంటి అశాస్త్రీయ విధానాలను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఇది రిటైర్డ్ ఉద్యోగుల సామాజిక భద్రతకు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి
అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన పీఆర్సీని జూలై 2023 నుంచి వర్తింపజేయాలని, పెండింగ్లో ఉన్న డీఏలను (కరువు భత్యం) తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పెన్షన్లో సీవీపీ రికవరీ కాలాన్ని ప్రస్తుతం ఉన్న 15 ఏళ్ల నుంచి 11 ఏళ్లకు కుదించాలని సూచించారు. గౌరవాధ్యక్షుడు కట్ట నాగభూషణ చారి మాట్లాడుతూ.. కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేసి, కార్మిక వర్గానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి పెన్షనర్ల సంఘం ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

