బొల్లికుంటలో విగ్రహ రాజకీయం: శివాజీ, అంబేద్కర్ వర్గాల మధ్య ఉద్రిక్తత
వీడని పట్టు.. కొనసాగుతున్న ధర్నాలు
రంగంలోకి పోలీస్, రెవిన్యూ యంత్రాంగం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండల పరిధిలోని బొల్లికుంట గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.

అసలేం జరిగిందంటే..?
గ్రామంలోని శివాజీ యూత్ సభ్యులు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే, గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఆ విగ్రహాన్ని తొలగించడంతో వివాదం మొదలైంది. దీనికి నిరసనగా ఈరోజు శివాజీ యూత్ సభ్యులు భారీ సంఖ్యలో తరలివచ్చి, విగ్రహ పునరుద్ధరణ పనులు ప్రారంభించారు.
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అంబేద్కర్ వాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి సమీపంలోనే అంబేద్కర్ విగ్రహం ఉందని, ఇక్కడ మరో విగ్రహం పెట్టవద్దని వారు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుని, పరిస్థితి ఘర్షణకు దారితీసింది.

రంగంలోకి యంత్రాంగం
విషయం తెలుసుకున్న మామునూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఆర్డీఓ సుమ, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ రంగంలోకి దిగి ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గుమిగూడిన జనాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

వీడని పట్టు.. కొనసాగుతున్న ధర్నాలు
అధికారులు నచ్చజెప్పినప్పటికీ, ఇరు వర్గాల వారు తమ పట్టు వీడటం లేదు. ఒకరు విగ్రహం ఉండి తీరాలని, మరొకరు ఇక్కడ పెట్టకూడదని భీష్మించుకుని అక్కడే ధర్నాకు దిగారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.

