“చదువే భవిష్యత్తు-“ప్రతి ఇంటికి విద్యా పిలుపు
కాకతీయ, కారేపల్లి: మండల కేంద్రంలోని భజ్యతండా గ్రామపంచాయతి పరిధిలోని బొక్కలతండలో గురువారం ఎంపీపీఎస్ పాఠశాలలో బడీబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యా ప్రాధాన్యతపై గ్రామ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయితీ సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు మాట్లాడుతూ, ప్రతి పిల్లవాడూ పాఠశాలకు వెళ్లి విద్యను అభ్యసించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను పూర్తిగా వినియోగించుకోవాలని తల్లిదండ్రులను కోరారు. బాలబాలికల భవిష్యత్తు బలంగా ఉండాలంటే పాఠశాల విద్య తప్పనిసరి అని అన్నారు.
పాఠశాల హెడ్‌మాస్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, బడీబాట కార్యక్రమం ద్వారా పాఠశాలలో చేరికలు పెంచడం లక్ష్యమని చెప్పారు. ఉపాధ్యాయులు గ్రామాల్లో తిరిగి, చదువుకు దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వాంకుడోత్ మంగీలాల్, అంగన్వాడీ టీచర్ రజినికుమారి, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. పిల్లలను పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులకు పిలుపునిస్తూ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

