ఎస్సీ బాలుర వసతిగృహంలో ‘సంక్షేమ వారోత్సవాలు’
మాతృమూర్తులకు పాదపూజతో భావోద్వేగ క్షణాలు
కాకతీయ, ఖమ్మం : ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సంక్షేమ వారోత్సవాలు’ ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతిగృహం (బి)లో గురువారం వైభవంగా జరిగాయి. నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు అంశాలు తల్లిదండ్రులను, విద్యార్థులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భావోద్వేగానికి గురిచేశాయి. వసతిగృహ సంక్షేమ అధికారి కోటపాటి రుక్మారావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ‘పాదపూజ’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవమనే సందేశాన్ని చాటుతూ.. విద్యార్థులు తమ తల్లుల పాదాలను పవిత్ర జలంతో కడిగి, పూలతో అలంకరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ దృశ్యం చూసి తల్లిదండ్రులు ఆనందభాష్పాలు రాల్చారు. ఈ ప్రక్రియ విద్యార్థుల్లో వినయం, కుటుంబ విలువల పట్ల గౌరవాన్ని పెంచుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, క్రీడలు మరియు వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రత్యేకంగా ముగ్గురు ఉత్తమ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రుక్మారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం వసతిగృహాల్లో అందిస్తున్న పౌష్టికాహారం, విద్యా వసతులను వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సిబ్బంది కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమం హాస్టల్ ఒకే కుటుంబం అనే భావనను పెంపొందించడమే కాకుండా సమానత్వ సందేశాన్ని చాటింది. తమ పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు.


